పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-6 సామంతం సంపుటం: 08-072

పల్లవి:

ఇద్దరును నవ్విరిదె యెడమాటలిఁకనేల
కొద్దిమీర మనమెల్లాఁ గోరినట్టే ఆయెను

చ. 1:

సరసములాఁడగాను చవిపుట్టె వలపులు
విరసపుటలుకలు వెడజారెను
తరితీపులవల్లను తమివుట్టె మీఁద మీఁద
కెరలిన వోట్లలో కిసరులు వాసెను

చ. 2:

కందువలనుండఁగా కన్నులకు నింపులాయ
మందలించె వెనకటి మంకులుమానె
సందడించి పెనగఁగా చనవులు మితిమీరె
చిందువందులై నట్టి సిగ్గు వెడజారెను

చ. 3:

ముంచి మాటలాడఁగాను మోవులతేనె దొరకె
చంచలపుఁ గపటాల సడిదీరెను
యెంచఁగ శ్రీవేంకటేశుఁడింతియునుఁ గూడిరిదె
కొంచముదొడ్డెరఁగని కొసరులు దక్కెను