పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రెకు: 0015-06 లలిత సం; 01-094 అధ్యాత్మ


పల్లవి:
తాప లేక మేడ లెక్కఁదలఁచేము
యేపులేని చిత్తముతో యీహీహీ నేము

చ.1:
ఎఱుకమాలినబుద్ది యెవ్వరైనాఁ బతులంటా
తెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేము
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా
వొఱపు నిలిపిన ట్లోహోహో నేము

చ.2:
యిందరును హితులంటా యెందైనా సుఖమంటా
పొందలేనిబాధఁ బొరలేము
మందమతిఁవాడు యెండమావులు చెరువులంటా
అందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము

చ.3:
మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటా
నాటకపు తెరువుల నడిచేము
గూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటా
యేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము