పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాగము: గుండక్రియ రేకు: 0013-01 సంపుటము: 1-77

॥పల్లవి॥ ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు
గూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు

॥చ1॥ ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లై
గాడఁబెట్టుచుఁజీము గారఁగాను
పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి
వీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు

॥చ2॥ కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు

॥చ3॥ వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగని
మదవికారము మతికి మరుపఁగాను
యిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-
సదమలానందంబు చవిగానలేఁడు