పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0009-04 భైరవి-రచ్చెతాళం సం: 01-058 కృస్ణ
పల్లవి: పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-
బట్టపు బలువుఁడ బాలుఁడా
చ. 1: ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్ను
సరుస నుతింప జఠరమున
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన-
పరమమూర్తివా బాలుఁడా
చ. 2: తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమున
వెల్లిగ లోలో వెఱవఁగను
కల్లనిదురతోఁ గనుమూసుక రే-
పల్లెలోఁ బెరిగిన బాలుఁడా
చ. 3: యేదెసఁ జూచిన నిందరి భయముల-
సేదలు దేఱఁగఁ జెలగుచును
వేదపల్లవపు వేంకటగిరిపై
పాదము మోపిన బాలుఁడా