పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0099-02 బౌళి సం: 01-496 అధ్యాత్మ

పల్లవి:
    కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను
పొనిఁగి వొరులకైతే బోధించే నేను
    
చ. 1:
    ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంత
సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను
సరవి దెలియ కేమో చదివేము నేము
    
చ. 2:
    యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత
చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను
    
చ. 3:
    దైవిక మొకకొంత తగుమానుషము గొంత
చేవలుచిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను