పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦88-04 సామంతం సం: 01-432 శరణాగతి


పల్లవి:
తెలియక వూరక తిరిగేము
చలమరి కగునా సంతతసుఖము

చ.1:
హేయము కడుపున నిడుకొని యింకా
'చీ' యనని మాకు సిగ్గేది
పాయము పిడికిటఁ బట్టుచునుండేటి
కాయథారులకుఁ గలదా విరతి

చ.2:
అంగనల రతుల యాసలనీఁదేటి
యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన
దొంగగురుని కిందుల నిజమేది

చ.3:
జననమరణములు సరి గని కానని
మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు
గని మనకుండిన గతి యిఁక నేది