పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0083-02 సాళంగనాట సం; 01-400 దశావతారములు


పల్లవి:
దేవదేవుడెక్కె నదె దివ్వరథము
మావంటి వారికెల్ల మనో రథము

చ.1:
జగతి బాలులకై జలధులు వేరఁ జేసి
పగటునఁ దోలెనదె పైఁడి రథము
మిగులఁగఁ గోపగించి మెరయురావణమీఁద
తెగి యెక్కి తోలేనదె దేవేంద్ర రథము

చ.2:
దిక్కులు సాధించి సీతాదేవితో నయోథ్యకుఁ
బక్కన మరలిచెఁ బుష్పక రథము
నిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము

చ.3:
బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె
అలయేఁగు బెండ్లికల్యాణ రథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము