పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రెకు: ౦౦82-06 గుజ్జరి సం: 01-398 భక్తి


పల్లవి:
ఇంతే మఱేమిలేదు యిందుమీదను
దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట

చ.1:
వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి-
నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుట
బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లా
పాల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట

చ.2:
యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి-
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లా
చయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట

చ.3:
శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరుని
జేకొంటే సిరులెల్లా జేకొనుట
మేకుల శ్రీహరినామమే నోర నుడుగట
కైకొన్న యమృతపుగందు వగుట