పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు:0066-04 సామంతం సం: 01-343 నామ సంకీర్తన


పల్లవి:
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం

చ.1:
సంతోషకరమైన సంకీర్తనం
సంతాపమణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం

చ.2:
సామజముఁ గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం

చ.3:
జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం

చ.4:
జలజాసనునినోరి సంకీర్తనం
చలిగొండసుతదలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం

చ.5
సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం