పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0065-06 ధన్నాశి సం: 01-339 అధ్యాత్మ


పల్లవి:
చదివెఁబో ప్రాణి సకలము యీ-
చదువుమీఁది విద్య చదువఁడాయఁగాని

చ.1:
సిరులు చంచలమని చేఁతలధ్రువమని
పరగుసంసారము బయలని
తొరలిన సుఖమెల్ల దుఃఖమూలమని
యెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని

చ.2:
తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపని
వలసీనొల్లమి దైవవశమని
కలిమియు లేమియుఁ గడవఁగ రాదని
తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని

చ.3:
యేచిన పరహితమెంతయుఁ దమ దని
వాచవులిన్ని నెవ్వగలని
యీచందమున వేంకటేశుచేఁతలని
చూచి లోభమువీడఁ జూడడాయఁగాని