పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦65-04 ఆహిరి సం: 01-337 అంత్యప్రాస


పల్లవి:
ఎండలోనినీడ యీమనసు
పండు గాయసేయఁబనిలేదు మనసు

చ.1:
వానచేతకములవలెనాయ మనసు
గోనెఁబట్టినబంకగుణమాయ మనసు
మానఁజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు

చ.2:
గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైన మనసు
గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు
అడుసులోపలికంబమై తోఁఁచె మనసు

చ.3:
తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు
మరుగఁజేసినచోట మరుగు నీ మనసు
తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు
సిరిగలిగినచోటఁ జేరు నీమనసు