పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0064-05 శ్రీరాగం సం: 01-332 దశావతారములు


పల్లవి:
సకలసందేహమై జరగుచున్నది యెకటి
ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని

చ.1:
వసుదేవుజఠరమనువననిధికిఁ జంద్రుఁడై
అసమానగతిఁ బొడమినాఁ డీతఁడు
వసుధఁ జంద్రుఁడు నీలవర్గుఁ డేఁటికినాయ
కసరెత్తి ననుఁగందు గలయఁగొనుఁబోలు

చ.2:
ఇనవంశమున లోకహితకల్పభూజమై
అ నఘఁడై జనియించినాఁ డీతఁడు
ననుపై నసురతరువు నల్లనేఁటికినాయ
పెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు

చ.3:
తరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణై
అరిదివలెఁ బొడచూపీనాఁ డీతఁడు
గరిమె నది యిపుడు చీఁకటివర్ధమేలాయ
హరినీలమణులప్రభ లలమికొనఁబోలు