పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0062-03 సామంతం సం: 01-318 అధ్యాత్మ


పల్లవి:
ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన
నిక్కమెరిఁగిన మహా నిత్యుఁడే ఘనుఁడు

చ.1:
వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తి
యాచరించని సోమయాజికంటె
యేదియునులేని కులహీనుఁడైనను విష్ణు_
పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు

చ.2:
పరమగువేదాంతపఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవి మాలిన యంత్యజాతికులజుఁడైన_
నరసి విష్ణునివెదకు నాతఁడే ఘనుఁడు

చ.3:
వినియుఁ జదివియును శ్రీ విభునిదాసుఁడుగాక
తనువు వేఁపుచునుండుతపసికంటె
యెనలేని శ్రీవేంకటేశుప్రసాదాన్న_
మనుభవించినయాతఁ డప్పుడే ఘనుడు