పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0062-01 శ్రీరాగం సం: 01-316 వైరాగ్య చింత


పల్లవి:
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె

చ.1:
పడిగొన్న మోహంబువలలఁ దగులైకదా
కడలేని గర్భనరకము లీఁదవలసె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలసె

చ.2:
పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదల తోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానక కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె

చ.3:
హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
పత్రిలేని నరకకూపమునఁ బడవలసె
అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా
బతిమాలి నలుగడలఁ బారాడవలసె