పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0044-03 కన్నడగౌళ సం: ౦01-270 వైరాగ్య చింత


పల్లవి:నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి
       కామింప నిట్టిదని కానరా దటుగాన

చ.1:నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి-
      నుండుదువుగాని నీ వొకటియునుఁ గావు
      దండిగలగిరి ప్రతిద్వని దోచుఁగాని యది
      కొండలోపల లేదు కొండయునుఁ గాదు

చ.2:బలసి యిన్నిటిలోపలనుఁ జైతన్యమై
      మెలఁగుదువుగాని యేమిట నీవు లేవు
      పలుదెరఁగులైన దర్పణమునందొక నీడ
      వొలయుఁగా కందు దలపోయు నది లేదు

చ.3:వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ-
      వుడివోయి యందుండ కుండుటయు లేదు
      చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ-
      పొడవు పరిపూ ర్ణమై పొలుపాందుఁగాన