పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0044-01 లలిత సం: 01-268 వైరాగ్య చింత


పల్లవి:ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము
       మోదమెరంగని మోహము ముందర గననీదు

చ.1:నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు
      సత్యాలాపవిచారము జరగదు లోభికిని
      హత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకును
      ప్రత్యక్షంబగుపాపము పాయదు కష్టునకు

చ.2:సతతానందవికాసము సంధించదు తామసునకు
      గతకల్మషభావము దొరకదు వ్యసనికిని
      జితకాముఁడు దా నవుటకు సిద్దింపదు దుష్కర్మికి
      అతులితగంభీరగుణం బలవడ దథమునకు

చ.3:శ్రీవేంకటగిరివల్లభు సేవా తాత్పరభావము -
      ద్రోవ మహలంపటులకు తోఁపదు తలఁపునకు
      దేవోత్తముఁగడు నీతని దివ్యామృతమగు నామము
      సేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు