పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0040-04 సామంతం సం: 01-246 అధ్యాత్మ

పల్లవి: పాపినైననాపాలఁ గలిగి తోవ
        చూపుమన్న నెందుఁ జూపరు

చ. 1: ధృతిదూలి జగమెల్లఁ దొరిగి వేసరితి
         యితరాలయముల కేఁగియేఁగి వేసరితి
         గతమాలి పరులపైఁ గనలి వేసరితి
         మతిమాలి కులవిద్య మాని వేసరితి

చ. 2: విసిగి యాచారంబు విడిచి వేసరితి
        పసచెడి ప్రియములు పలికి వేసరితి
        కొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితి
        కసుగంది లోలోనె కాఁగి వేసరితి

చ. 3: కోవిదులగువారిఁ గొలిచి వేసరితి
        దైవములందరిఁ దడవి వేసరితి
        శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-
       సేవలన్నియు నేఁ జేసి వేసరితి