పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0034-03 శంకరాభరణం సం: 01-210 అథ్యాత్మ


పల్లవి: ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే
       వున్నవారియీవులెల్ల నొద్దికయ్యీనా

చ.1: తెగనియాపదలకు దేవుఁడే కలఁడుగాక
      వగలుడుపఁ బరులవస మయ్యీనా
      నొగిలి యితరలకు నోళ్ళుదెరచిన
      నగుఁబాటేకాక మానఁగఁబొయ్యీనా

చ.2: అగ్గలపుదురితాలు హరియే మానుపుఁగాక
      బగ్గన నొక్కరు వచ్చి పాపఁబొయ్యేరా
      తగ్గుముగ్గులైనవేళ తలఁచినవారెల్ల
      సిగ్గుఁబాటేకాక తమ్ముఁ జేరవచ్చేరా

చ.3:యెట్టు నేసినను వేంకటేశుఁడే నేరుచుఁగాక
      కట్టఁగడవారెల్లఁ గరుణించేరా
      యిట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁగాక
      వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా