పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0003-07 శ్రీరాగం సం: 01-020 భక్తి
పల్లవి: అన్నియును నతని కృత్యములే
యెన్నియైనానవు నతఁడేమి సేసినను
చ. 1: అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే
చ. 2: పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీఁది చింత పాయక నిజం బైతే
నిరతిఁ బట్టినవెల్లా నిధానములే
చ. 3: మదనగురుని సేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతి భక్తి గలిగితేను
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే