పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0031-01 ఆహిరి సం: 01-188 వైరాగ్య చింత

పల్లవి:పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసా
      పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాఁడే చెప్పనె మనసా

చ.1:చింతించకుమీ శివునివైరిచే చిక్కువడకుమీ వోమనసా
     కంతువారకము వయసుఁ బ్రాయములు కావటికుండలు వోమనసా
     యెంతే మేలుఁగీ డేకాలము ఎప్పుడు నుండదు వోమనసా
     సంతరించుకో వానిని మనసున సంతోషముగా వోమనసా

చ.2:యెన్నికలే తలపోయకుమీ యేమరకుండుమి వోమనసా
    కన్న విన్న వారిలో నెప్పుడు కాకుపడకుమీ వోమనసా
    పున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసా
    మిన్నో నేలనిమన్న దినములో మీఁదుచూడకుమి వోమనసా

చ.3:కన్నులసంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసా
    వన్నెలమాటలు చెవులఁబెట్టక వాసివిడువకుమి వోమనసా
    మున్నిఁటిసురలు బ్రహ్మదులకై నను ముక్తి సాధనము వోమనసా
    వెన్నుని వేంకటగిరిఁ దలఁచుము వేసారకుమీ వోమనసా