పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0030-03 వరాళి సం: 01-184 వైరాగ్య చింత


పల్లవి:

 వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ


చ. 1:

 చాల నమ్మి యీ సంసారమునకు సోలిసోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
మాలెమీఁద పరు వెందాఁకా నీమచ్చిక విడువఁగ లేవు


చ. 2:

 మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధములదుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగలేవు


చ. 3:

 పామరివై దుర్వ్యాపారమునకుపలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగాలేవు
తామసమతివయి వేంకటనాథునితత్వ మెఱఁగఁగాలేవు