పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0029-06 ధన్నాశి సం: 01-181 వైరాగ్య చింత


పల్లవి:

 ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడనిజీవనము


చ. 1:

 చలముఁ గోపంబుఁ దనుఁ జంపేటిపగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్నపరనింద తనపాలి మృత్యువని
తొలఁగినది యదిగదా తుదగన్నఫలము


చ. 2:

 మెఱయు విషయములే తనమెడనున్నవురులుగా
యెఱిఁగినది యదిగదా యెరుక
పఱివోనియాస దనుఁ బట్టుకొను భూతమని
వెఱచినది యదిగదా విజ్ఞానమహిమ


చ. 3:

 యెనలేని తిరువేంకటేశుఁడే దైవమని
వినఁగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనఁగలిగినదిగదా మనుజులకు మనికి