పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0025-05 గుండక్రియ సం: 01-153 వైరాగ్య చింత


పల్లవి :

పోయం గాలము వృథయై పుట్టిన మొదలుం గటకట
నీయెడ నామది నిజమై నిటుచుట యెన్నఁ డొకో


చ. 1:

కుడిచిన నాఁకలి దీరదు కడువఁగఁ గుడువఁగఁ బైపై
కడుఁబొదలెడు దీపన మిది గడచుట యిఁక నెట్లు
కుడువక మానుట యెన్నడు కోరికదీరుట యెన్నడు
తడయక నీరూపము నేఁ దలఁచుట లెన్నఁడొకో


చ. 2:

జీవుఁడుపుట్టిన మొదలునుఁ జేతికి నూఱట చాలక
యేవిధమున భుజియించిన నెడయదు దీపనము
శ్రీవేంకటపతి నా కిఁక శ్రీకరుణామృత మియ్యక
పావనమందదు నామది పాలించంద గదా