పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0025-03 సామంతం సం: 01-151 వేంకటగానం


పల్లవి :

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


చ. 1:

కుమ్మరదాసుఁడైన కురువరతినంబి
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి
రమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు


చ. 2:

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడు
మచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు


చ. 3:

కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-
ణించి తనయెడకు రప్పించినవాఁడు
యెంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకు
మంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు