పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0023-04 శ్రీరాగం సం: 01-140 దశావతారములు


పల్లవి :

ఏది చూచిననుఁ గడు నిటువంటి సోద్యములే
మేదినికిఁ గిందుపడి మిన్నందనేలా


చ. 1:

కరిరాజుగాంచినకరుణానిధివి నీవు
అరిది నరసింహరూపైతివేలా
వురగేంద్రశయనమున నుండి నీవును సదా
గరుడవాహనుఁడవై గమనించనేలా


చ. 2:

పురుషోత్తమఖ్యాతిఁ బొదలి యమృతము వంప
తరుణివై వుండ నిటు దైన్యమేలా
శరణాగతులకు రక్షకుఁడవై పాము నీ౼
చరణములకిందైన చలముకొననేలా


చ. 3:

దేవతాధివుఁడవై దీపించి యింద్రునకు
భావింప తమ్ముఁడనఁ బరిగితేలా
శ్రీవేంకటాచలస్థిరుఁడవై లోకముల౼
జీవకోట్ల లోనఁ జిక్కువడనేలా