పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0023-02 ధన్నాశి సం: 01-138 ఆరగింపు


పల్లవి :

పంకజాక్షులు సొలసిపలికి నగఁగా
నింకా నారగించు మిట్టనే ఆయ్యా


చ. 1:

కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములు
పలుదెరఁగులై న అప్పములగములు
నెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా


చ. 2:

పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁద
పిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములును
వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా


చ. 3:

కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి-
అడియాల వూరుఁగాయల రుచులతో
బడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా