పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0022-06 శ్రీరాగం సం: 01-136 వైరాగ్య చింత


పల్లవి :

దేహము దా నస్థిరమట దేహి చిరంతనుఁడౌనట
దేహపు మోహపు నేఁతలు తీరుట లెన్నఁడొకో


చ. 1:

కన్నులఁబుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల
కన్నులు మనసునుఁ దనియక గాసిఁబడిరి జనులు
తన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడు
తిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో


చ. 2:

సిగ్గులు దొలఁగనియాశలఁ జిక్కికదా దుర్మానపు-
సిగ్గుల యెగ్గులచేతను చిక్కువడిరి జనులు
సిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడు
తగ్గుల మొగ్గుల నేఁతలు తలఁగుట లెన్నఁడొకో


చ. 3:

మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగ
మనసే తానగు దైవము మరచిరి యుందరును
అనయము తిరువేంకటపతి యాత్మఁదలఁచి సుఖింపుచు
ఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో