పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0020-05 భూపాళం సం: 01-123 వైరాగ్య చింత


పల్లవి :

ఏమో తెలిసెఁగాని యీజీవుఁడు
నేమంపు నెరవిద్య నేరఁడాయ


చ. 1:

కపటాలె నేరిచెఁగానీ జీవుఁడు
యెపుడైనా నిజసుఖ మెఱఁగఁడాయ
కవురులే చవిగొనెఁగానీ జీవుఁడు
అపరిమితామృత మానఁడాయ


చ. 2:

కడలనే తిరిగీఁగానీ జీవుఁడు
నడుము మొదలుఁ జూచి నడవఁడాయ
కడుపుకూటికే పోయీఁగానీ జీవుఁడు
చెడని జీతముపొంతఁ జేరఁడాయ


చ. 3:

కనియుఁ గానకపోయఁగానీ జీవుఁడు
దినము వేంకటపతిఁ దెలియఁడాయ
కనుమాయలనె చొక్కెఁగానీ జీవుఁడు
తనియ నిట్టే మంచిదరిఁ జేరఁడాయ