అధ్యాయము - II
తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ.
4. (1) ఈ క్రింది సందర్భములలో, తల్లి/తండ్రితో సహా వయోవృద్ధ పౌరుడైన వ్యక్తి, తన స్వీయ సముపార్జితం ద్వారా లేదా స్వంత ఆస్తి ద్వారా తనకు తాను భరణ పోషణ జరుపుకోలేనపుడు, 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తు చేసుకొనుటకు హక్కు కలిగి ఉండును-
(i) తల్లి/తండ్రి లేదా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు మైనరు కానటువంటి ఒకరు లేక అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగియున్నపుడు;
(ii) సంతానము లేని వయోవృద్ధ పౌరుడు 2వ పరిచ్ఛేదపు ఖండము (జి)లో నిర్దేశింపబడినట్టి బంధువును కలిగియున్నపుడు;
(2) వయోవృద్ధ పౌరుడు తమ మామూలు జీవితము గడపడానికి కావలసినంత అవసరములతో, పోషించగల బాధ్యత మేరకు అట్టి వయోవృద్ధ పౌరుల సంతానము లేదా సందర్భానుసారము బంధువుపై ఉండును;
(3) తండ్రియైననూ లేక తల్లియైననూ లేక సందర్భానుసారము అట్టి తల్లిదండ్రు లిద్దరి సాధారణ జీవనమున కైనట్టి అవసరములను కలుగుజేయు భరణ పోషణ మేరకు సంతానములోని అతని లేక ఆమె యొక్క బాధ్యతయై ఉండును.
(4) వయోవృద్ధ పౌరుని బంధువై ఉండి మరియు తగినంత జీవనాధారమును కలిగియున్న ఎవరేని వ్యక్తి, అట్టి వయోవృద్ధ పౌరుని పోషించవలెను. అయితే, అతడు అట్టి వయోవృద్ధ పౌరుని ఆస్తిని స్వాధీనములో ఉంచుకొన్నవాడై లేదా అట్టి వయోవృద్ధ పౌరుని ఆస్తికి వారసుడై ఉండవలెను:
అయితే, వయోవృద్ధ పౌరుని ఆస్తికి వారసుడగుటకు హక్కు కలిగి వుండిన బంధువులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, అట్టి బంధువులు వయోవృద్ధ పౌరుని ఆస్తి యొక్క వారసత్వపు దామాషాలో వారి భరణ పోషణము నిమిత్తము చెల్లించవలెను.
5.(1) 4వ పరిచ్ఛేదము క్రింద భరణ పోషణ నిమిత్తము ఈ క్రింది వారు దరఖాస్తు చేయవచ్చును-
(ఎ) వయోవృద్ధ పౌరుడు లేదా సందర్భానుసారము తల్లి/తండ్రి; లేదా
(బి) వారు అశక్తు లైన యెడల వారి నుండి ప్రాధికారమీయబడిన ఎవరేని ఇతర వ్యక్తి లేదా వ్యవస్థ; లేదా
(సి) తనంత తానుగా ట్రిబ్యునలు సంజ్ఞానము చేయవచ్చును.