పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పుణ్యుఁడయైన సద్గురుని పూజ [1]నిరంతముఁ జేసి, భక్తిచే
గణ్యము సేయ, కాగురునిఁ గండలుగాఁ దెగఁగోసి, మోక్షమున్
గణ్యముఁజేసి, ముక్తియను కాంత వినోదముఁ జూడ, వేఱ షా
ఢ్గుణ్య మెఱుంగలేఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

80

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధరింపుము! మనుష్యుడు పుణ్యాత్ముడైన ఉత్తమగురుపుంగవుణ్ణి నిరంతరం శ్రద్ధతో సేవించి, ఆయనయందలి భక్తివలన ఏమాత్రమూ సంకోచింపకుండా, ఆ గురువర్యుని నిజాయితీని నిశితంగా పరిశోధించి, ఆయనయొక్క అనుగ్రహవిశేషంచేత మోక్షమనే యువతి తోడి వినోదాన్ని పడయజాలిన అదృష్టశాలి వేతే షడ్గుణాలకొరకు- అనగా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం- అనే ఆఱు దివ్యగుణాలకొరకు ఎదురుచూడక, ఆనందమయుడై అలరారుతూవుంటాడు.

  1. 'నిరంతరము'- అను అర్థంలో ప్రయోగింపబడింది.