పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆడకు హంగ పుట్టఁగను నార్భటమందుచు నింటిలోనఁ బో
రాడుచునుండినంతటను, నంతకు[1]కింకరు లొచ్చి వేగఁ ద
న్నీడిచి తన్నఁగాను దన కెవ్వరు నడ్డముగాను రారు; ఆ
గోడెడఁబాప నీవె! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

34

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! జీవుడు అవసానదశను చేరుకొని ఇంటిలో మృత్యువుతో పోరాడుతూ వుండగా, యముని సేవకులు వచ్చి తనను బలవంతంగా లాగి, తన్నినప్పుడు, తన కెవ్వరూ అడ్డపడలేరు. అలాంటి ఆపత్ సమయంలో ఆ బాధనూ, దుఃఖాన్నీ, నివారించి జీవుణ్ణి ఆదుకొనే సంరక్షకుడవు నీ వొక్కడవే సుమా! (అటువంటి సర్వరక్షకుడవయిన నీకు నావందనం!)

  1. 'కింకరులు+వచ్చి' - అని పదవిభాగము