పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మరగితి నీ పదాబ్జముల మానసమం దెడఁబాయఁ జాలకన్,
గరిమను [1]భానుఁ డొచ్చుటకుఁ గంజములెల్ల నపేక్షసేయు నా
కరణిని నీవు వచ్చుటకు గట్టిగ నా హృదయాంబుజంబు మేల్
గుఱుతుగఁ గోరునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

19

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మనస్సు నీ పాదపద్మాలను ఎడబాయజాలని విధంగా మచ్చిక అయ్యింది. అందువల్ల నాహృదయసరోజం కమలసమూహం సూర్యుని రాకను కోరినట్లుగా దృఢంగా మీ రాకను కోరుతూవున్నది. (దయచేసి నా మనఃపద్మపీఠంమీదకు వేంచేయుమా! స్వామీ!)

  1. 'భానుఁడు + వచ్చుటకు' - అని పదవిభాగము