పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందుమాట

కలియుగదైవంగా ప్రశస్తిగాంచిన వేంకటరమణుని భక్తపరంపరలో ఒక్కొక్కరిది ఒక విశిష్టత, ఈ విశిష్టత ఆ యా భక్తులు శ్రీవారిని ఆరాధించటంలో అవలంబించిన మార్గాలవల్ల మనకు వెల్లడవుతూవుంటుంది. 'శ్రీ వేంకటాచలమాహాత్మ్యం' వంటి సరస కావ్యాలను స్వామికి సమర్పించి తరించిన తరిగొండ వెంగమాంబ ఆ దేవదేవుని భక్తబృందంలో అగ్రగణ్యయైన కవయిత్రీశిరోమణి! ఈ 'కవితాతపస్విని' తిరుమల క్షేత్రంలో తపోవనం లాంటి ఒక తులసీ బృందావనాన్ని నెలకొల్పింది. ఆ 'బృందావనం'లో రాజయోగసాధనతో పాటు, వాఙ్మయ తపస్సు కావిస్తూ శ్రీనివాసునకు అంకితంగా అనేక కృతులను వెలువరించింది.

ఈ మహాకవయిత్రి రచించిన పదునెనిమిది కృతుల్లో చాలా భాగం అముద్రితంగా, సాహితీపరులకు అందుబాటులో లేనివిగా అజ్ఞాతంగా ఉంటున్నాయి. తిరుమలేశునికి మీదుకట్టి అవతరించిన ఈ రచనల నన్నిటిని ప్రచురించవలసిన ఆవశ్యకతను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈకవయిత్రి పేరట ఒక గ్రంథ పరిష్కరణ ప్రాజెక్టును నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తి.తి.దే. "శ్వేత" సంస్థ సంచాలకులయిన శ్రీ 'భూమన్' గారికి అప్పగించింది.

ఉద్యమస్ఫూర్తి మేళవించిన ఉత్సాహపూరితులయిన "శ్వేత” సంచాలకులు శ్రీ 'భూమన్' గారు ఇటీవలే ఈ కవయిత్రి సారస్వతంపై ఒక జాతీయ సాహితీసదస్సును విజయవంతంగా నిర్వహించటమే కాక,. ఈ కవయిత్రి రచనలయందలి వేర్వేరు గీతాలకు ఆడియో సీ.డీ.లను తగిన గాయనీ గాయకులచే తయారు చేయిస్తుండటం మిగుల ముదావహమయిన విషయం.

హరికీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలలాగానే, ఈ కవయిత్రి యొక్క సాహితీ సమారాధనోత్సవాలను ఈమె జన్మదినమైన నృసింహుని జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించడానికికూడా