పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వాతంత్య్రోద్యమ కాలంలో ఒకవైపున బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో ప్రదాన పాత్ర వహిస్తూ సంఘం సంస్కరణకు, సత్సంఘం నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ, సామ్యవాద వ్యవస్థ స్థాపనకు పాటుపడిన ఉద్యమకారుల గురించి కూడా రచయిత వివరించారు.

1919లో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణించి దేశం వదలి వెళ్ళాలని ముస్లింలు తీసుకున్న నిర్ణయం మేరకు కొందరు దేశం విడిచి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు సానుకూల పరిస్థితులకు నోచుకోక అష్టకష్టాలు పడి అటునుండి రష్యా వెళ్ళి, సామ్యవాద వ్యవస్థపట్ల ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులై షౌకత్‌ ఉస్మాని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దాక్షిణ భారత దేశంలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి సిద్ధపడి వచ్చి పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సీనియర్‌కు కమ్యూనిజాన్ని పరిచయం చేసిన అమీర్‌ హైదర్‌ ఖాన్‌, సామ్యవాద వ్యవస్థ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన కాకాబాబు ముజఫర్‌ అహమ్మద్‌ లాంటి ప్రముఖుల గురించి ఈ గ్రంథంలో ఉన్న ఆసకకర విషయాలు మనల్ని ఆకట్టుకుంటాయి.

జమీందారి కుటుంబం నుండి వచ్చినప్పిటికీ సోషలిస్టు భావాల పట్ల ఆకర్షితు లై జమీందారీ వ్యవస్థ రద్దుకు కృషి చేసిన జాతీయ కాంగ్రెస్‌ నేత రఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌, క్విట్ ఇండియా, సైమన్‌ వ్యతిరేక ఉద్యమాలలో సింహంలా విక్రమించిన సామ్యవాది యూసుఫ్ అలీ లాంటినే తలకు, కార్మికుడిగా జీవితం ఆరంభిం చి, జాతీయోద్యమంలో ప్రవేశించి ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకులలో ఒకరై, ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన అబిద్‌ అలీ లాంటి యోధుల జీవిత విశేషాలు ఆకట్టుకుంటాయి. ఈ గ్రంథంలో ప్రచురించిన వందమంది స్వాతంత్య్రసమరయోదులలో అత్యధికుల చిత్రాల వలన వారి కృషి, త్యాగం పాఠకుల హృదయాల మీద చెరగని ముద్ర వేస్తుంది.

ఈ విధంగా మానవీయ-లౌకిక విలువల కోసం జీవితాలను ధారపోసిన వంద మంది స్వాతంత్య్రసమర యోధుల విశేషాలను అందించిన చిరస్మరణీయులు గ్రంథానికి పరిచయవాక్యం రాసే అవకాశం నాకు లభించినందుకు సంతోషిస్తూ, చరిత్రకారులు, రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాను.