Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భ్రాధ్వమునన్ సురాళి గొనియాడఁ బ్రలంబవిరోధి యాజికిన్.

56


ఉ.

అత్యధికప్రతాపము జనావళి సన్నుతిఁ జేయ సంగరౌ
చిత్యము మీఱి వర్మము విచిత్రకిరీటముఁ దాల్చి శస్త్రసాం
గత్యమున న్విరోధులకుఁ గాలుఁడనం గడుభీకరాకృతిన్
సాత్యకి వచ్చె భర్మరథజాలము మ్రోయఁగ యుద్ధభూమికిన్.

57


శా.

విద్యుల్లీలఁ జెలంగు ఖడ్గలతికావిర్భూతరుగ్జాలముల్
ఖద్యోతప్రభ నించఁ శంఖరవ మాకాశంబునం బర్వ యు
ద్ధోద్యోగంబున మత్స్యకేతనముతో యోధావళు ల్వెంట
రాఁ బ్రద్యుమ్నుం డరుదెంచె వైరికులగోత్రచ్ఛేదదంభోళియై.

58


మ.

ఘనబాణాసనబాణకుంతపరిఘాఖడ్గంబుల న్మించు మిం
చినతే రున్నతలీల నెక్కి సిడమున్ జిత్రాతపత్రంబు మీ
ఱ నవీనోజ్జ్వలదివ్యవర్మము శిరస్త్రాణంబుఁ జూపట్టఁగా
ననిరుద్ధుం డనిరుద్ధవృత్తి నడచెన్ హర్షంబు సంధిల్లఁగన్.

59


శా.

చండప్రక్రియ మేఘడంబరము లాశాచక్ర మొక్కుమ్మడిన్
నిండ న్నవ్యరథంబుపై నిలిచి తూణీరంబులున్ సజ్యకో
దండంబున్ ధరియించి కంకటశిరస్త్రచ్ఛన్నుఁడై చారుదే
ష్ణుం డేతెంచె మహోజ్జ్వలాకృతి రణక్షోణీజయోత్సాహియై.

60


ఉ.

అంబుజలోచనప్రతిముఁ దాహవకేళిధురంధరుండు బీ
రంబున విల్లునమ్ములుఁ గరంబులఁ బూని విపక్షభీకరా
డంబరవృత్తి దిక్కులు వడంక మహారథ మెక్కి వేడ్కమై
సాంబుఁడు వచ్చె వాహినులసంఖ్యలు గొల్వఁగ యుద్ధభూమికిన్.

61