Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

పిడుగులు నల్గడం బడియెఁ బెల్లుగ నెత్తురువాన వట్టె మి
న్నడరెఁ దురంగపుచ్ఛముల నగ్నికణంబులు రాలెఁ గైదువుల్
పొడిపొడి యయ్యె మత్తగజపుంగవగండమదాంబుధారలున్
దొడిఁబడి యింకె సైనికధనుర్ధరు లాత్మ భయంబు నొందఁగన్.

7


వ.

ఇట్లు మహోత్పాతంబులు గనుంగొని యగ్గాండీవి శాంతన
వానుమతంబునఁ దచ్ఛాంతివిధానంబు గావించి నడచిన
యవసరంబున.

8


సీ.

మత్తవారణగండమండలీనిస్సర
             ద్దానధారల సముద్రములు పొంగ
నాశీరచరణగంధర్వరింఖోద్ధూత
             ధూళిచే గగనసింధువు గలంగ
నిష్ఠురస్యందననేమిఘంటానినా
             దముల హేమాద్రి[1]సింహములు చెదర
బరభయంకరవీర బలబాహుఖడ్గదీ
             ధితులచేఁ జండాంశుదీప్తి పొదల


తే.

విజయదుందుభికాహళవేణుశంఖ
మురజఢక్కాహుడుక్కాసమూహరావ
మఖిలదిక్కులు నిండ బ్రహ్మాండ మగల
సేన లరుదెంచె నాకురుక్షేత్రమునకు.

9


క.

పాండవులుఁ గౌరవులు భీ
ష్ముండును ద్రోణుండు ద్రుపదముఖ్యులు నచటన్
మండితనివాసములయం
దుండిరి జయకాము లగుచు నుచితప్రీతిన్.

10
  1. శిరములు చెదర