పీఠిక
తొలుదొలుత నీచిత్రభారతమును మ. రా.రా. శ్రీ రావుబహదూరు కందుకూరి వీరేశలింగముపంతులుగారు తమచింతామణి మాసపత్రికయందుఁ బ్రకటించి 1898 సం.నఁ బుస్తకరూపముగాఁ బ్రచురించియుండిరి. అప్పుడు వా రీగ్రంథమున కీక్రిందివిధమునఁ బీఠిక వ్రాసియుండిరి—
"ఈచిత్రభారతము మిక్కిలి యపురూపమయిన గ్రంథము. ఇది యిప్పుడు దొరకుటయే యరుదుగ నున్నది. బ్రహ్మశ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు తమశబ్దరత్నాకరనిఘంటువులో దీనిని నామమాత్రావశిష్టము లైనగ్రంథములలో నొకదానినిగాఁ జేర్చియున్నారు. పోలవరపు జమీన్దారుగారగు బ్రహ్మశ్రీ శ్రీరాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణరావుగారి సాహాయ్యమువలనఁ గొంతకాలముక్రిందట నా కీగ్రంథముయొక్క ప్రతియొకటి లభించెను. అదియు శుద్ధమయినది కాదు. అక్కడక్కడఁ గొన్నిచోట్ల పద్యపాదములు సహితము విడువఁబడియుండినవి. అయినను నాకుఁ బ్రత్యంతరము దొరకకపోవుటచేతను, ఇంకను నుపేక్ష చేసినచో నీయున్నప్రతికూడ నశించునేమో యన్నభీతి కలఁగుటచేతను, లోపించిన భాగములను యథాశక్తిని పూరించి వానిని వలయితములు చేసి, స్ఖాలిత్యములను సంస్కరించి చింతామణిలోఁ బ్రచురింప నారంభించి యిప్పటి కీగ్రంథము నొకరీతిని సమగ్రముగా ముద్రింపించితిని. దీనిప్రతి యెవ్వరివద్దనైన నున్నచో వారు దయచేసి నాకుఁ బంపినయెడల సరిచూచి తగినసంస్కరణములు చేసి వారిప్రతిని వారికి వందనపూర్వకముగాఁ బంపివేసెదను.
చెన్నపురి, పరశువాకము,
23, వెల్లాలవీథి,
కందుకూరి వీరేశలింగము"
10-1-1898 సం॥