Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆమంత్రి కులవరేణ్యుని
భామామణి సింగమాంబ పతిహితసుగుణ
స్తోమావలంబ కనియెన్
హేమాచలధైర్యయుతుల నిరువురసుతులన్.

34


సీ.

పరమదయాసక్తి హరిపాదభక్తులు
             మానితాచారంబుగా నొనర్చి
గురునమస్కారభూసురపురస్కారంబు
             లనుదినవ్రతముగా నాచరించి
శిష్టరక్షణమును దుష్టశిక్షణమును
             నిత్యకృత్యంబుగా నిర్వహించి
సత్యభాషణమును సాధుపోషణమును
             నైజవర్తనముగా నోజపఱిచి


తే.

శౌనకవ్యాసశుకపరాశరవసిష్ఠ
నరవిభీషణగాంగేయనారదాది
పరమభాగవతోత్తమస్ఫురణ మించు
వారు నారయ మాదయ్య గార లవని.

35


శా.

వందారువ్రజదోషమేఘపననున్ వారాశిగంభీరు నా
నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞు విశ్వంభరా
మందారక్షితిజాతము న్నిగమసన్మార్గప్రతిష్ఠాపకున్
గందాళాప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.

36


క.

ఆదేశికపదకమలము
లాదరమున హృదయవీథి ననవరతంబున్
మోదమున నిలిపి శ్రీలల
నాదయ మనినారు నారనయు మాదనయున్.

37