Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్భూరమణేంద్రుఁ డద్భుతముఁ బొందుచు భావములోన నుబ్బుచున్.

66


సీ.

భూరిభుజాదండభూషణంబుగ నొప్పు
             దారుణతరగదాదండ మమర
నతిభయానకమూర్తి యగుమృత్యుదేవత
             గరములు మోడ్చి ముంగల వసింపఁ
[1]జండకోదండభీషణపాణియై వైరి
             దుర్వారవీరజిత్తుఁడు భజింప
నఖిలప్రపంచభయంకరకింకర
             శ్రేణులు గ్రందుగాఁ జేరి నిలువఁ


తే.

బ్రాణిసంఘాతముల పుణ్యపాతకాయు
రర్థములజాడ వ్రాసి యాయవ్యయముగఁ
జిత్రగుప్తుండు వినిపింపఁ జిత్రలీలఁ
గొలువు గూర్చున్న జమునిఁ గన్గొనియె నంత.

67


వ.

కని తద్విశేషంబు లిట్లని తలంచె.

68


సీ.

పాపపుణ్యములందుఁ బక్షపాతము లేక
             వర్తించుటను సమవర్తి యయ్యె
వరుసఁ దప్పక ప్రజాపరిపాలనము సేయ
             ధర్మరాజఖ్యాతి దాల్చి మించెఁ
బ్రళయకాలమునాఁడు ప్రాణిసంఘాతంబు
             నణఁగించుకతనఁ గృతాంతుఁ డయ్యె
సమదారివీరుల సంగ రాంగణములఁ
             బ్రహరించుటను దండపాణి యయ్యె

  1. జండకోదండభీషణఖడ్గపాణియై
                 దుర్వారలీలఁ జిత్రుఁడు భజింప