పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

చతుర్వేదసారము


మహి "నిజవర్ణ సమాధిభిరన్య" య
             నంగ భక్తికి సమానంబు గలదె
"యోగప్రవృత్తాంత యోగే నతుపరా" య
             నంగ భక్తికి సమానంబు గలదె
మఱి "నతవర్ణ సమాధిభిరన్య" య
            నంగ భక్తికి సమానంబు గలదె
నలిని "మంత్రా ధ్యయనై శ్చనతుశివా" య
            నంగ భక్తికి సమానంబు గలదె


జపములును దపములు యోగసాధనములు
మంత్రతంత్రాదినియమసమాధివిధులు
ధ్యానములు సాంఖ్యయోగనిదానములును
వసుధ శివపూజ కెన యౌనె బసవలింగ!

138


శుద్ధలింగార్చనోత్సుకలీలఁ గాక య
            భ్యాసయోగములఁ బాపములు చెడునె
లింగావధానకల్పితమనోరతిఁ గాక
            ధ్యానమార్గము శివుఁ గాన నగునె
ప్రాణలింగైక్యసంబంధసంగతిఁ గాక
            వాయుధారణ ముక్త్యుపాయ మగునె
ధృతిఁ బశుపాశుపతిజ్ఞానమునఁ గాక
            యద్వైతవిధులు నిత్యత్వ మగునె


నియమితాచారసద్భక్తినిష్ఠఁ గాక
భ్రాంతియోగంబులను ముక్తి భవ్య మగునె
లింగనిష్ఠాగరిష్ఠవిలీనవృత్తి
కెసఁగ సమ మౌనె యోగంబు బసవలింగ!

139