పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

9


పరవాదిమదగజప్రబలపంచాస్యంబు
           పరవాదిభూధరవజ్రధార
పరవాదిమేఘ నిర్భరపవమానంబు
           పరవాదిభూరుహప్రథితపరశు
పరవాదితస్కరపటుతరశూలంబు
          పరవాదిజలనిధిబాడబాగ్ని
పరవాదిలతలకు భాస్వల్లవిత్రంబు
          పరవాదిభేకిభీకరముఖాహి


దండనాయకబసవఁ డుద్దండశౌర్యుఁ
డతఁడు పరవాదినిర్హరణార్థబుద్ధి
మతము లాఱింటిఁ జర్చించు మహితసూక్తు
లెసఁగ రచియింతు వసుమతి బసవలింగ!

16


భక్తచింతామణి భక్తచూడామణి
          భక్తైకనుతుఁడు సద్భక్తియుతుఁడు
భక్తసత్ప్రాణుండు భక్తకళ్యాణుండు
          భక్తసంబంధుండు భక్తివిభుఁడు
భక్తవిధేయుండు భక్తసహాయుండు
          భక్తకింకరుఁడు సద్భక్తిపరుఁడు
భక్తాంతరంగుండు భక్తాబ్జభృంగుండు
          భక్తహృన్మయుఁడు సద్భక్తిచయుఁడు


దండనాథుండు బసవఁ డుద్యద్గరిష్ఠుఁ
డాదివృషభుండు భక్తహితార్థబుద్ధి
మతము లాఱింటిఁ జర్చించు మహితసూక్తు
లెసఁగ రచియింతు వసుమతి బసవలింగ!

17