వైధర్మ్యంబులును గలవు. కేవలసాధర్మ్యములనే యాలోచించినచో నీయిరువురుకవులలో నొకరి నొకరు తప్పక యనుకరించి రని స్ఫురింపకతీరదు. ఇరువురిలో నెవ్వరు ప్రాచీనులో వారి నర్వాచీను లనుకరించి రనుట సమంజసము గదా! మల్లన పూర్వుఁ డనియు మాధవరాయఁ డర్వాచీనుఁ డనియు మాయభిప్రాయము.
ఎలకూచి బాలసరస్వతి తాను రచించిన యాంధ్రశబ్దచింతామణి భాష్యములోఁ దనవంశావతారము నీక్రిందిరీతి నిచ్చియున్నాఁడు—
1. తిప్పన, 2. వల్లభసోమయాజి, 3. తిప్పన, 4. భైరవార్యుఁడు, 5. తిరుమలార్యుఁడు (రామయ), 6. భైరవుఁడు, 7. కృష్ణకవి, 8. బాలసరస్వతి. వీరిలో నైదవపురుషుఁ డగు తిరుమలార్యుఁడు "అళియరామావనీంద్రదత్తయెడవిల్లిముఖ్యసద్గ్రామవిభుఁ" డని వర్ణింపఁబడియెను. ఈతిరుమలార్యుఁడు 1564 సంవత్సరప్రాంతమున నున్నను నతనిమనుమని కొడు కగు బాలసరస్వతి మఱి యఱువదిసంత్సరముల పిదప, ననఁగా 1614 ప్రాంతమం దుండియుండవలయును. ఈబాలసరస్వతిచే మల్లభూపాలీయమును గృతిఁగొన్న పెద్దమల్లభూపాలుఁడు నాకాలమందే యుండునుగదా. చంద్రికాపరిణయకర్త యగుమాధవరాయఁ డీమల్లభూపాలుని కొడు కని కొందఱును మునిమనుమఁ డని కొందఱును జెప్పుదురు. కొడు కనుకొన్న నాతనికాలము క్రీ. 1644 సంవత్సరప్రాంత మగును. కావున నీతఁడు తరిగొప్పుల మల్లనకంటె నర్వాచీనుఁడే.
గ్రంథములపోలికలు
చంద్రభానుచరిత్రము—ద్వితీయాశ్వాసము
సీ. | నిడుచాలు వెనుచాయ నడకనిద్దపుఁ దేఁటిగమివీరజడలతో గంధవహుఁడుఁ | 131 |