Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

ఎదుటఁ బిమ్మట నైన నెప్పుడేనియు భక్తి సేయనే న న్నింత సేయనేల
యేయెడ నీ వానతిచ్చినదాస్యంబు సేయనే న న్నింత సేయనేల
[1]నిత్యకృత్యంబుగా నీపాదసంసేవ సేయనే న న్నింత సేయనేల
కలనైన నీమూర్తిఁ గనుఁగొన్న వినయంబు సేయనే న న్నింత సేయనేల
భావవాక్కాయకర్మము ల్నీవశంబు, సేయనే నీవు న న్నింత సేయనేల
సవతిబిడ్డల కిట్లు మత్సరముఁ బెంచి, చివ్వ యొనరింప నింత సేసితివి గాక.

⁠ 138


క.⁠

అని యిట్లు పలుకుపలుకు, ల్విని తనయత్నంబు కడుఫలించె ననుచు న
మ్ముని యలరి రిత్తబొమముడి, గొని యప్పుడు తెచ్చికోలుకోపముతోడన్.

⁠ 139


మ.⁠

తగు నయ్యా నను నిట్లు పల్కుటకు సత్యానందనా నీవు ము
న్నుగ నీవీణియ మీటి యీశ్రుతులసంధు [2]ల్గూర్చి యీశుద్ధసా
ళగభేదంబు లెఱింగి యీసకలమేళప్రాప్తము ల్నేర్చి యుం
టిగదా పెక్కులు పల్క నేల బళిరే నీశిష్యతల్ చేకుఱెన్.

⁠ 140


[3]మ.⁠

మరుఁ డెంతేనియుఁ దెల్సినం దెలియు నీమార్గంబు నీకంటె మా
సరవిన్ ఱొమ్మున నమ్ముగట్టుకొని యాసాయంప్రభాతంబు ని
ద్దురయుం గూడును మాని తెల్పినను నీదుర్బుద్ధి యిట్లయ్యె నెం
తురె మానేరమి గాఁగ నిట్టి వకటా ధూర్తస్వభావంబునన్.

⁠ 141


క.⁠

తగ వెఱుఁగలేక యిటువలెఁ దెగువరి వై పలుక నీకె తీరెనొ కుసుమా
శుగునకును నీకు నిపు డీ, జగడంబులు సేయఁగా నిచట నిల్చితినే.

⁠ 142


సీ.⁠

చెల్లఁబో నీచేతివల్లకీరత్నదండము దాల్ప యోగదండంబె మాకు
[4]నయ్యయో నీ చేతియసమవిపంచికగవిసెన ల్కాషాయకములె మాకు
నక్కట నీచేతియలపరివాదినీ[5]తంత్రీలతలు జన్నిదములె మాకుఁ
గటకటా నీచేతికప్పువీణియకాయ సలిలపూరితకమండలువె మాకు
బాపురే నీకు విద్య నేర్పంగవలసి, పడినపా యెల్ల నుగ్రతపంబె మాకు
హరిహరీ నిన్ను నిట్టిదుష్టాత్ముఁ డౌట, నెఱుఁగలేనైతి విడువు మి దేడగొడవ.

⁠ 143


క.⁠

ఆనలినాక్షుఁడు నేర్పుము, గా నమ్మని ప్రియము చెప్పఁగా [6]బాలుఁడుగా
పోనిమ్మని యే నిందుకుఁ, బూనినఫల మబ్బెఁ జాలుఁ బోపొ మ్మనినన్.

⁠ 144
  1. ↑ చ-లో నీచరణము నాల్గవదిగా నున్నది. ట-లో నీచరణమునకు మాఱు 'పోరామి చెడకుండ గారాముతో భక్తి సేయనే న న్నింత సేయనేల' అని కలదు.
  2. ↑ చ-చూచియుం
  3. ↑ క-లో నీపద్యము లేదు.
  4. ↑ ట-నయ్యరో
  5. ↑ చ-తంత్రిక ల్బలుజన్నిదములె
  6. ↑ ట-మొకమోటన్