పుట:గబ్బిలము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గబ్బిలము

చిక్కినకాసుచేఁ దనివిఁ చెందు నమాయకుఁ డెల్ల కష్టముల్‌
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులుఁ గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కఁడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డఁడై

పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్‌
ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకుఁ డేలియున్న తం
జాపురి మండలంఁబునకుఁ జక్కగ దక్షిణభాగ భూములన్‌
కాపురముండె నప్పరమ గర్భదరిద్రుఁడు నీతిమంతుడై.

ముప్పు ఘటించి వీని కులమున్‌ గలిమిన్ గబళించి దేహమున్‌
పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగాఁ
జెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు; నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌.

వాని ఱెక్కల కష్టంబు లేనినాఁడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనముఁ బెట్టు వానికి భుక్తిలేదు