Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర్ణాటకామినీకర్ణహాటకరత్న
                        తాటంకయుగధాళధళ్యములకు,


తే.

నిర్నిబంధనిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబునఁ పలుకనేర్తు,
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని
సమ్ముఖంబున దయ చూడు ముమ్మ సుకవి!

95


చ.

పస గల ముద్దుమోవి, బిగి వట్రువగుబ్బలు, మందహాసమున్,
నొసట విభూతిరేఖయుఁ, బునుంగున తావి, మిటారి చూపులున్,
రసికులు మేలు! మేలు! బళిరా! యని మెచ్చఁగ, రాచవీటిలోఁ
బసిఁడిసలాక వంటి యొకబల్జెవధూటిని గంటి వేడుకన్.

96


ఉ.

పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగఁ గౌ నసియాడుచుండఁగాఁ,
జెవ్వునఁ జంగ సాఁచి, యొకచేతను రోకలి బూని, యొయ్యనన్
నవ్వు మొగంబు తోడఁ తన నందనుఁ బాడుచు, నాథుఁ జూచుచున్,
"సువ్వియ సువ్వి" యంచు నొకసుందరి బియ్యము దంచె ముంగిటన్.

97


ఆ.

మందరాద్రిసములు మానవు లందఱు,
చందమామకూన లిందుముఖులు,
కందులేని మౌక్తికంబులు జొన్నలు,
కుందనంపుబెడ్డ, కుందుగడ్డ.

98


ఉ.

వంకరపాగలున్ నడుము వంగిన కత్తులు, మైలకోకలున్,
సంకటి ముద్దలున్, జనుప శాకములున్, బులు పచ్చడంబులున్,
దెంకగు నోరచూపులును, దేఁకువ దప్పిన యేసబాసలున్,
రంకుల బ్రహ్మ యీ మసరరాజ్యము నెట్లు సృజించెనో కదా?

99