పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


శా.

ఒప్ప న్నీపదభక్తి లేక తమచే నున్నంతలో కొంచెమో
గొప్పో పేదల కియ్యనొల్లక కుయుక్తుల్ నేర్చి వేదాంతపుం
జొప్పే కానక సర్వముం దెలియునంచున్ శుష్కవేదాంతముల్
చెప్ప న్మోక్షము గల్గునా జనులకున్ శ్రీ...

70


శా.

గానంబేకద పెద్ద యెల్లకళలన్ గౌరీశ లోకంబులన్
దానంబేకద మేటిసద్గుణములన్ దర్కింప నీసత్పద
ధ్యానంబేకద లెస్స సర్వపురుషార్థకశ్రేణిలోఁ జూడ ల
క్ష్మీనాథార్చితపాదపంకజయుగా శ్రీ...

71


శా.

కాయక్లేశముల న్సహించి మిగుల గాసిల్లి మాయావిధో
పాయవ్యాప్తులఁ బొట్టకంచు సిిరి గూర్పన్ జూతురేకాని య
య్యో యీదేహము నమ్మరాదనుచుఁ దా రూహించి నీధ్యానమున్
జేయంజాల రిదేమి సామి మనుజుల్ శ్రీ...

72


మ.

ఘనతన్ బ్రహ్మశిరంబు ద్రుంచి తది యుక్తంబేకదా గాఢలు
బ్ధుని విత్తాధికుఁ గాఁగ దాతను దరిద్రుం గాఁగ నత్యంతరి
క్తున నేకాత్మజయుక్తుఁ గాఁగ ననపత్యుం గాఁగ సంపన్నుఁ జే
సిన యాబ్రహ్మకు నట్ల కావలె సుమీ శ్రీ...

73


మ.

ధన మున్నప్పుడె దానధర్మములచేతల్ దల్లిదండ్రుల్ క్షితి
న్మనునాఁడే తదభీష్టసంఘటన సమ్యక్పాటవంబైన యౌ
వనమందే వరతీర్థయాత్రలు నరత్వంబందె నీపూజఁ జే
సినవాఁడేకద జాణ యెందు నరయన్ శ్రీ...

74