పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


శా.

స్వామీ నీనిజభక్తకోటికి మహైశ్వర్యంబు లెట్లిచ్చితో
నీమైఁ జూడ దిగంబరుండనిక నెంతేగోచియున్ లేదు నీ
సామర్థ్యం బది యెట్టిదో శ్రితులకున్ సర్వేప్సితశ్రేణి ని
స్సీమోదారత నిచ్చెదందురు బుధుల్ శ్రీ...

40


మ.

ఒకటౌ బిల్వదళంబు పల్దళములై యొండొక్కపు వ్వర్థిఁ బా
యక పూబోణులసంఖ్యలై యొకఫలం బాత్మేష్ట నానాఫల
ప్రకరంబై యొకయింతతోయ మెలమిన్ బల్తోయమై వన్నెవా
సికి నెక్కు న్మును భక్తి నీ కొసఁగినన్ శ్రీ...

41


శా..

నీభార్యామణి సర్వమంగళ భవన్మిత్రుండు దా శ్రీదుఁడున్
నీభవ్యాశ్వము భద్రమున్ దలఁప నెంతే నీస్వధర్మంబు లో
కాభీష్టార్ధములెల్ల నిచ్చు వరకళ్యాణస్వరూపం బిఁకే
రీ భాగ్యోన్నతి నెన్న నీసరిదొరల్ శ్రీ...

42


మ.

క్షితికన్యాపతియంతవాఁడును నినున్ సేవించియేకాని తా
శతసంఖ్యామితయోజనాబ్ధి గడవనా శక్తుండు గాఁడయ్యె నిం
కితరు ల్నేర్తురె నిన్ భజింపక యపారేచ్ఛాతరంగానివా
రితసంసారపయోధి దాటుటకు నో శ్రీ...

43


శా.

నీకై మొక్కు లొనర్చునట్టిశిర మెంతేయుత్తమాంగాఖ్యకౌ
నీకీర్తి స్తుతిసేయుజిహ్వయును వర్ణింపన్ రసజ్ఞాఖ్యకౌ
నీకళ్యాణకథాప్తి నుండుచెవులున్ నిక్కంబు శ్రుత్యాఖ్యకౌ
శ్రీకంఠా యటుగానివెల్ల దగునా శ్రీ...