ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
కువలయాశ్వచరిత్రము
చతుర్థాశ్వాసము
క. శ్రీరాజద్వేంకటగిరి, శౌరిపదాంభోజభజనజనితోజ్జ్వలతో
- దారవిభవేంద్ర సవరము, నారాయణభూపచంద్రనయగుణసాంద్రా.1
గీ. అవనరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁ దొడఁగె
- నమ్మదాలస పటకుటీరంబుదారి, కమ్మతావులతెమ్మెర ల్గమ్ముదారి.2
క. వని సొచ్చుట మరునకు న, ర్చన లిచ్చుట సొమ్మసిల్లి సఖియలవలనం
- గనువిచ్చుట వా రచటికిఁ, జనుదెంచుట యెఱుఁగలేక తన్మయదశచేన్.3
సీ. మనవులు విన్నవించిన వినునోయంచుఁ జేరుకన్నియమిన్న చిన్నఁబోవ
- ననబంతి కానుకిచ్చినఁ జూచునోయంచు వచ్చు నెచ్చెలి తలవంచికొనఁగఁ
- నెనరుతో హెచ్చరించినఁ బల్కునోయంచుఁ గదియు పైదలి సిగ్గు గాంచి యొదుగ
- గనిపించి జాతి చెప్పిన నవ్వునో యంచు నరుదెంచు హరిణాక్షి యవలి కరుక
- వినక చూడక పలుకక వేదనాప్తి, నవ్వ కాపద్మనయన కాంతవశరాగ్ని
- తప్తకిసలయముక్తనూతనపునఃప్ర, వాళకృతశయ్యఁ బొరలాడువేళయందు.4
ఉ. ఈవనజాయతాక్షిఁ దరుణేక్షుధనుష్కతురుష్కమౌళి యా
- హా వెత పెట్టెనంచు హృదయార్ద్రదయాభ్యుదయాప్తి చేత రా
- జీవశరప్రహారగతిఁ జెందుట తెల్పఁగ నేగె నాఁగ గం
- గావిభుఁ జేరెఁ గింశుకనఖద్యుతిఁ జొత్తిలి మిత్రుఁ డయ్యెడన్.5
శా. ఛాయాప్రాగవకర్షణంబు సరసీజాతాంతభోగంబు కౌ
- లాయానీకపతంగపాకపితృజాలప్రాప్తి పాంథప్రజా
- స్థేయస్థానగతిప్రబోధకము దూతీప్రార్థనారూఢజా
- రాయత్నంబు జరన్మహాతప ముదారంబయ్యె నంతంతకున్.6
చ. వడి నపరాద్రిఁ జెంద నని వాసిగఁ బద్మిని నెత్తిమీఁదఁ జే
- యిడి కరసంగతి న్సమయ మేగఁ దదాశఁ గుఱించి రాగ మే
- ర్పడఁగఁ జనంగఁ దేజమెదఁ బాయఁడె యీయినుఁ డంచు మ్రోఁత పె
- ల్లడఁరగఁ జాటుసూటి సరసాళితతు ల్మొఱసెం గొలంకులన్.7