Jump to content

పుట:కువలయాశ్వచరిత్రము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7

బొలయల్కఁ జుఱుకుఁజూపులఁ జూచి యూర్వశీబిబ్బోకవతి చౌకువేట్లు పడియెఁ
దిమ్మనరపాలు చికిలిదోదుమ్మిదారి, బలిమిఁ దెగటారి సురపురప్రాంగణమున
నరలెడు కటారిరాహుత్తవరులచేతఁ, గీడుచేయదె మడియలతోడిచెలిమి.39

సీ. అమరనాయకుమీఁది యాస యటుండఁగా బాదుషాపై యాస పల్లవించెఁ

బొసఁగినఘనవిధంబులవా రటుండఁగా దురువరంబులవారిమురువు హెచ్చె
లలితంపురుద్రవీణలవా రటుండఁగా మఱిరఖాబులవారిమాట హెచ్చె
హృద్యోత్సవంబు లనేకంబు లుండఁగాఁ గానిపనులదండుగలు సెలంగె
నబ్జహితుపేరు లవియెన్నియైన నుండఁ, ప్రౌఢకర్తారుశబ్దంబు రూఢికెక్కెఁ
దిమ్మనృపఖడ్గధారావిదీర్ఘమత్త, ఖానపుంగవసాంగత్యగరిమ దివిని.40

సీ. నికరంబుఁ పాపోసులకు మ్రొక్కుమనుచు దేవేంద్రనందను బట్టి యీడ్చి రనుచుఁ

జేష్టలుమాని దేశీయము ల్వినిపించు మంచుఁ దుంబురు నడ్డగించి రనుచు
సారాయికొపెర గంజాపొడు ల్దెమ్మంచు నంగడు ల్వడిఁ గొల్లలాడి రనుచు
లాయంబులోఁ బను ల్గావింప రమ్మంచు హరిణితోఁ గడునెగ్గులాడి రనుచు
దిమ్మనృపహతయవను లొందించులూటి, నమరపురిఁ జేర వెఱచు దిశాధిపతుల
కెఱుఁగఁజేయంగ నచ్చటి కిచ్చటికిని, నారదుం డాసుఁగ్రోవిచందమునఁ దిరుగు.41

గీ. అతఁడు తిర్మలదేవి మూర్త్యంబ రంగ, మాంబ లక్ష్మాంబ కొండమాహరిణనయన

గురవమాంబను నిజబంధుకోటు లెంచ, వరలువేడుకతోడ నుద్వాహమయ్యె.42

సీ. భర్త వినాయకప్రౌఢసంగతిఁ జెందఁ దాఁ గల్కివగల సంతసముఁ జెందుఁ

బతి ద్విజరాజాగ్రపాద మౌదలఁ దాల్ప, దా మహిభృత్పాదతతి భజించు
విభుఁడు సుధర్మాభివృద్ధిఁ బెంపువహింప, దా సురామోదసంధాన మొందు
వరుఁడు ప్రాభాకరవ్యాలోలరతిఁ గాంచఁ దాను జంద్రాలోక మూని చెలఁగు
ననుచు హరిజాయ హరురామ నమరనాథు, కొమ్మనంబుజభవుముద్దుగుమ్మఁ దెగడి
కాంతునకు నానుకూల్యసంఘటన యొసఁగు, ధీరసద్గుణనికురుంబ తిర్మలాంబ.43

సీ. వరుని సదా గదాకరుని జేయుటెకాని యిందిరాజలజాక్షి కేమి కొదవ

చెలువుచే మరుమాట చెల్లించుటయేకాని హిమశైలతనుజాత కేమి కొదవ
నాధునిజాడ్య మొందఁగఁజేయుటేకాని యిలజహ్నునందన కేమి కొదన
కాంతుని గోత్రారిఁగాఁ జేయుటేకాని యింద్రుపట్టపురాణి కేమి కొదవ
తరము గావింపరాదె యీతరలనయన, తోడ వారల ననుచు బంధువులు వలుక
విభున కత్యంతభాగ్యంబు వెలయఁజేయు, కీర్తితగుణావలంబ యామూర్తిమాంబ.44