పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

77


సీ.

లవణాబ్ధి లంఘించు పవనాత్మజున కొక్క
                   తోటకాలువ పూని దాటుటెంత
జగమెల్ల ముంచు వర్షము నించు కాలాంబు
                   ధరమున కొకపాదు దడుపుటెంత
బహులోకవాంఛితఫలదమౌ సురశాఖి
                   కొక యణూపమఫలం బొసగుటెంత
చెడుగు రక్కసిమూఁకఁ జెండు చక్రమునకుఁ
                   బుడమి నొక్కరుని జంపుట యదెంత


తే.

సకలబ్రహ్మాండభాండరక్షణకలాభి
రామునకు నీకు ననుఁ బ్రోచుటేమి వింత?
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

78


సీ.

నదులలో జాహ్నవి నరులలో విప్రుండు
                   గ్రహములలోనఁ బంకజహితుండు
తృణములలో దర్భ మృగముల సింగంబు
                   వ్రతముల ద్వాదశి లతల జాజి
దానమ్ములం దన్నదానమ్ము లోహజా
                   తమ్ములలోనఁ గార్తస్వరంబు
గిరులలో మేరువు పురములలో కాశి
                   తరువుల రావి సంతతులఁ గృతియు


తే.

నెట్లు పూజ్యములయ్యె నట్లెల్లవేల్పు
గములయందును నీవె కా ఘనుఁడ వరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

79